ముఖ్యమంత్రి రోశయ్య

నేటి రాజకీయాలు .... మన నాయకులు....

Friday, August 6, 2010

నాపై కుట్ర : ముఖ్యమంత్రి రోశయ్య

ఎవరూ వేలెత్తిచూపే ఆస్కారం లేకుండా తాను ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే కొందరు కుట్ర పన్ని కావాలని అలజడి సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి రోశయ్య నిప్పులు చెరిగారు. ఏవేవో ఆలోచనలు చెప్పి ఆందోళన చేయిస్తున్నారని, దానికి కావాల్సిన సరంజామా ఇచ్చి కథ నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఫిల్మ్‌నగర్‌ బస్తీ వాసులతో సమావేశం సందర్భంగా రోశయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. తాజా రాజకీయపరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

తనను అస్థిరపరిచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయన్న భావం రోశయ్య మాటల్లో వ్యక్తమయింది. ముఖ్యమంత్రి నోటి వెంట కుట్ర అనే మాట రావడం పెద్ద విషయంగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆయన తన వ్యాఖ్యలకు సంబంధించి ఎవరి పేరును ఉదహరించలేదు. ఉపకార వేతనాలు, బోధన రుసుముల చెల్లింపు విషయంలో కొందరు చేస్తున్న విమర్శలపై ఆయన కొద్దిరోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను బీసీ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నా మంత్రులు సక్రమంగా స్పందించడంలేదని కూడా తప్పుపట్టారు. దాంతో గురువారం బీసీ మంత్రులంతా కలసికట్టుగా విలేకరుల సమావేశం పెట్టి బీసీలకు ప్రభుత్వం ఏం చేస్తోందీ వివరించారు. వై.ఎస్‌ హయాంలోనూ బకాయిలు ఉన్నాయనే వాస్తవాన్ని గణాంకాలతో వారితోనే చెప్పించారు. అదే సమయంలో ఇటు తాను కూడా ప్రత్యక్షంగా విమర్శలకు దిగారు.

క్యాంపు కార్యాలయంలో మాట్లాడేటప్పుడు తొలుత స్థానిక సమస్యలను ప్రస్తావించిన రోశయ్య ఆపై ప్రభుత్వ విధానాలను వివరిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఫీజులు ఇవ్వట్లేదని, ఉపకారవేతనాలు ఇవ్వట్లేదని అలజడి రేకెత్తించి, ఆందోళనను చేపట్టి, దానికి కావాల్సిన పెట్రోలు, డీజిల్‌, ఆయిల్‌ ఇతర సరంజామా ఇచ్చి కథ నడిపిస్తున్నారని అన్నారు. పేదవారికోసం అంకితభావంతో పనిచేసే ప్రభుత్వం తమదని, తమ నిజాయితీని, పనితీరును అంతా అర్థం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం చేపట్టే ఏ పథకమైనా ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలన్నారు. పేదల పేరుతో దోపిడీ జరగకుండా, పక్కదారి పట్టకుండా సక్రమంగా అమలు కావాలన్నారు. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చేయటానికి కావల్సిన సలహాలను, సూచనలను ఏక పక్షంగా తీసుకోవడం లేదని, మంత్రులందరం కలిసి చర్చించుకొని నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. పేద ప్రజలకోసం వైఎస్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దుచేయబోమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికే 74 లక్షల మందికి పింఛన్లను ఇస్తున్నామని, వాటిని మరింతగా పెంచేందుకు ఆలోచిస్తున్నామని చెప్పారు. నగరాల్లోని బస్తీవాసుల భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.

No comments:

Post a Comment