ముఖ్యమంత్రి రోశయ్య

నేటి రాజకీయాలు .... మన నాయకులు....

Sunday, August 15, 2010

అంతకంతా వసూల్ ఎమ్మార్‌పై కఠిన వైఖరికే సర్కార్ నిర్ణయం - చర్యలకు వెనకాడొద్దని సీఎం ఆదేశం?

  
26% డెవలప్డ్ ఏరియా కోసం పట్టు
రేటు ప్రాతిపదికపై రెండు ప్రతిపాదనలు
సమీప స్థలం లేదా.. ఎల్ అండ్ టీ ధర
కోర్టుకెళ్లినా ఎదుర్కొనేందుకు సిద్ధం

అక్రమార్కులు తిన్నదంతా కక్కించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఎమ్మార్ అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ), ఎమ్మార్-ఎంజీఎఫ్ మధ్య వివాదంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు.. అభివృద్ధి చేసిన భూముల్లో 26 శాతం వాటాను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవాలని తీర్మానించింది.

అంతకు అంతా వసూలు చేయాలని నిర్ణయించుకున్న సర్కారు.... ఇప్పటికే విల్లాలు నిర్మించి అమ్మేసిన వాటికి సంబంధించి.. సమీప స్థలాల్లో ఉన్న రేటు లేదా.. అక్కడికి కొంత దూరంలో ఎల్అండ్‌టీ నిర్మించి, విక్రయించిన విల్లాల రేటు ప్రాతిపదికగా ఎమ్మార్ నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ మేరకు ప్రభుత్వానికి ఫైల్ పంపాలని కూడా ఏపీఐఐసీని ఆదేశించాలని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం.

ఈ విషయంలో తాజా పరిస్థితిని సమీక్షించడానికి అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం క్రోడీకరిస్తోంది. ఎమ్మార్ విక్రయించిన విల్లాలకు 20శాతమే తెల్లధనం తీసుకున్నారని, మిగిలినదంతా నల్లధనమేనని పలువురు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మార్ రికార్డులను విశ్వసించలేమని స్పష్టం చేస్తున్నారు. కనుక అభివృద్ధి చేసిన భూమిలో 26శాతం వాటా దక్కించుకోవడం, ఇప్పటికే విక్రయాలు జరిగినట్లయితే.. ఎల్అండ్‌టీ రేట్లను ప్రాతిపదికగా చేసుకోవడంపై ప్రభుత్వం స్థిర నిశ్చయంతో ఉంది.

అయితే ఇందుకు ఎమ్మార్-ఎంజీఎఫ్ అంగీకరిస్తుందా? అనేది సందేహమే. ఒప్పందం ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని, ఈ సంస్థ చెబుతున్నది. అధికార ప్రతినిధులు ఎమ్మార్ బోర్డుకు హాజరై తీర్మానాలపై సంతకం చేశారని, వారు ప్రభుత్వానికి చెప్పక పోవడం, అనుమతి తీసుకోకపోవడం తమ తప్పు ఎలా అవుతుందని కూడా ఈ సంస్థ ప్రతినిధులు వాదిస్తున్నారు. అయితే ప్రభుత్వ ప్రతినిధులు ఇద్దరు చేసిన నిర్వాకంతో సంస్థ కోర్టుకు వెళితే దానిని ఎలా ఎదుర్కొనాలనే విషయంలో పాలనా యంత్రాగం పరిశీలన జరుపుతున్నదని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

మరోవైపు.. గతంలో ఏపీఐఐసీకి చైర్మన్‌గా పని చేసి, ఆ ఒప్పందంలో సంతకం చేసిన ప్రస్తుత పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య సమస్యను అతి చిన్నదిగా పేర్కొంటుండటం, ఇందులో సాంకేతిక అంశాలు మాత్రమే ఉన్నాయని పాలనా యంత్రాంగానికి వివరిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. ఆచార్య, మీనాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్‌కు వేర్వేరు నివేదికలు ఇచ్చారని సమాచారం. వీటిని సీఎస్ పరిశీలిస్తున్నారని తెలిసింది.

అయితే.. కొందరికి కొమ్ము కాసే విధంగానే ఆచార్య వాదన ఉందన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇందులో భారీ కుంభకోణం ఉందని, సీబీఐ విచారణ జరగాలని కొందరు మంత్రులు చేస్తున్న డిమాండ్‌తో ఏకీభవిస్తోందని తెలుస్తోంది. అన్ని కోణాల నుంచి అధ్యయనం చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడరాదని ముఖ్యమంత్రి రోశయ్య ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

భారీ స్థాయిలో జరిగిన ఈ కుంభకోణంపై పూర్తిస్థాయి రిపోర్టును తనకు అందించాలని ఇప్పటికే భారీ పరిశ్రమల మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఏపీఐఐసీ ఎమ్‌డీని కోరినా, అది ఇంకా మంత్రికి చేరలేదు. ఏపీఐఐసీలో అంతర్గత కమిటీని నియమించినా.. దానితో పెద్దగా ప్రయోజనం ఉండదని, రిపోర్టు రూపకల్పనకే అది పరిమితమవుతుందని భావిస్తున్నారు.

అయితే మొత్తం వ్యవహారంలో జరిగిన ఒప్పందం ఉల్లంఘన, అతితక్కువ రేటు విక్రయాలతో ఏపీఐఐసీకి టోపీ పెట్టిన విధానం, దీనిని భర్తీ చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులు ఇప్పటికే నిర్ణయానికి వచ్చినా.. న్యాయ సలహాల తర్వాతనే కార్యాచరణ ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమస్యపై రాజకీయ దుమారం రేగడంతో పాటు.. అధికార కాంగ్రెస్ ప్రతిష్ఠ కూడా ఇమిడి ఉండటంతో పాలనా యంత్రాంగం తదుపరి చర్యలు కీలకంగా మారనున్నాయి.

సాంకేతిక సమస్య మాత్రమేః ఆచార్య
సాంకేతిక లోపం తప్ప ఈ వ్యవహారంలో పెద్దగా సమస్య లేదని బీపీ ఆచార్య వివరిస్తున్నట్లు తెలిసింది. మంత్రి కన్నాతోపాటు, ఉన్నతాధికారులతో సమావేశమైన సందర్భంలోనూ ఇదే మాటకు ఆచార్య కట్టుబడి ఉన్నారని విశ్వసనీయ సమాచారం. రాజకీయ ప్రమేయంతోనే ఆచార్య పునః నియామకం జరిగిందని, దీంతో వారిని రక్షించేందుకు అయన అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు పెరుగుతున్నాయి.

ఈ హోదాతో ఏపీఐఐసీ డైరెక్టర్‌గా కూడా తిరిగి చేరి, బోర్డులో తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తున్నట్లుగా ఇటీవలే జరిగిన సమావేశంలో రూఢీ అయ్యింది. బోర్డు తీర్మానాలు తిరిగి ప్రభుత్వం వద్దకు వచ్చిన సమయంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శిగా తిరిగి వాటిని పరిశీలించి, చర్యలు తీసుకునే అధికారం కూడా ఆచార్యకే ఉంటుంది. దీంతో తిరిగి ఏపీఐఐసీని తన పెత్తనం కిందనే పెట్టుకోవాలనే లక్ష్యంతో రాజకీయ నేతల అండదండలతో ఈ పదవిలో కొనసాగుతున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి.

అప్పటి సీఎం వైఎస్ నియమించిన మంత్రివర్గ ఉప సంఘం అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య నేతృత్వంలో ఎమ్మార్‌పై సమీక్షించింది. పారిశ్రామిక ప్రగతికి ఆటంకం కలిగించకుండా ఈ సంస్థ విషయంలో పాత ప్రభుత్వ నిర్ణయాలన్నీ కొనసాగించాలని నిర్ణయించింది. అయితే స్వల్ప మార్పులకు సిఫారసు చేశారు. భూమి విలువను పెంచాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలో ఒప్పంద ఉల్లంఘనపై దృష్టిసారించి అవసరమైతే ఒప్పందం రద్దుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు అన్నారు.
ఎమ్మార్‌లో ఎందరో హేమాహేమీలు.. విల్లా సాల్లో మంత్రులు !
boulder_hill రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రతిష్ఠను మింగేసేందుకు అనకొండ మాది రిగా తయారయిన ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ భూ కుంభకోణం వ్యవహారంలో తవ్వినకొద్దీ కొత్త విషయాలు వెలుగుచూస్తు న్నాయి. తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు అధికార-ప్రతిపక్షాలు ఈ వ్యవహారంలో అందినకాడికి లబ్ధిపొందినట్లు తెలుస్తోంది. ఈ రకంగా అన్ని పార్టీలనూ ఎమ్మార్‌ సం తృప్తి పరిచి, ఇప్పటివరకూ తన అక్రమాలు బయటపడకుండా విజయవంతంగా వ్యవహరించింది. అయితే, ఆ కంపెనీ అక్రమాలను సర్కారులో ఉన్న పార్టీ పెద్దలే బయటకు తీసుకురావడంతో ఎమ్మార్‌ అక్రమాలు, వాటాల దందాలు క్షేత్రస్థాయిలో చర్చ నీయాంశమయ్యాయి. ఇప్పటి వరకూ వెలుగుచూసిన పేర్లతోనే విస్మయానికి గురవుతున్న ప్రజలు, తాజాగా వెలుగుచూస్తున్న మరికొన్ని పేర్లతో మరింత ఆశ్చర్యానికి గురికాక తప్పదంటున్నారు. ఎమ్మార్‌లో కాంగ్రెస్‌, టీడీపీ, టీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు విల్లాలు, ఫ్లాట్లు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కొందరు వామపక్ష నాయకులకు పార్టీ ఫండ్‌ కింద నిధులు తీసుకున్నట్లు చెబుతున్నారు. వారితోపాటు ఐఏఎస్‌ అధి కారులు కూడా ఉన్నారని చెబుతున్నారు. ప్రస్తు తం వీరిలో 12 మంది వివిధ విభాగాలకు ముఖ్య కార్య దర్శులుగా వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రి పేషీలో పనిచేసిన, చేస్తున్న వారికీ ఇక్కడ వాటాలున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలోఅన్ని పార్టీలూ కలసి తమకు అన్యాయం చేశాయని ధ్వజమెత్తుతున్నారు. ఇందులో కొంద రికి ఉచితంగా విల్లాలు, ఫ్లాట్లు కేటాయించగా, మరికొందరికి తక్కువ ధరకు ఇచ్చారంటున్నారు. అయితే, వీరిలో చాలామంది బినామీల పేరుతోనే ఫ్లాట్లు తీసుకున్నారని బాధితులు వివరిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ హయాం నుంచీ మొదలయిన ఎమ్మార్‌ అక్రమాలపై దివంగత కాంగ్రెస్‌ నేత పి.జనార్దన్‌రెడ్డి పోరాడారు. టీడీపీ హయాంలో యువ పారిశ్రామికవేత్తలుగా పేరున్న కోనేరు ప్రసాద్‌ (దుబాయ్‌ ప్రసాద్‌), ఇంకా అప్పటికి రాజకీయ ప్రవేశం చేయని ల్యాంకో రాజగోపాల్‌ సీఎం పేషీలో తిష్ట వేసిన విషయం తెలిసిందే. అప్పటి పలుకుబడితోనే ప్రసాద్‌ విదేశీ సంస్థ అయిన ఎమ్మార్‌ను హైదరాబాద్‌కు రప్పించారు. ఆ తర్వాత ప్రభుత్వం పడిపోయినప్పటికీ వైఎస్‌ సర్కారు కూడా ఎమ్మార్‌కు పట్టం కట్టింది. నాటి ఆర్థిక మంత్రి రోశయ్య ఛైర్మన్‌గా ఉన్న కమిటీ ఇచ్చిన క్లియరెన్సు, సిఫార్సులు ఎమ్మార్‌కు మరింత ఊపిరిపోశాయి. ఎమ్మార్‌ సంస్థ ఎంజిఎఫ్‌ అనే భాగస్వామ్య సంస్థను నిబంధనలకు విరుద్ధంగా ఆహ్వానించడంతో వివాదం మొదలయింది. దానితో కోనేరు ప్రసాద్‌ ఆ సంస్థ నుంచి వైదొలగారు.

కాగా, ప్రస్తుతం క్యాబినెట్‌లో ఉన్న బొత్స సత్యనారాయణ, గీతారెడ్డి, పొన్నాల లక్ష్యయ్య, గల్లా అరుణకూ విల్లాలు, ఫ్లాట్లు ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. గతంలో ఏపిఐఐసి ఛైర్మన్‌గా పనిచేసిన అంబటి రాంబాబుకూ బినామీ పేరుతో ఫ్లాటు ఉందంటున్నారు. కాగా, అప్పట్లో వైఎస్‌ సర్కారులో కీలకపాత్ర పోషించి, ఏపిఐఐసిని తన కనుసన్నలలో నడిపించారనే ఆరోపణలున్న కేవీపీ రామచంద్రరావుకు మూడు విల్లాలు బినామీ పేరుతో ఉన్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకూ ఎమ్మార్‌ ఫ్లాట్ల సేవ చేసిందంటున్నారు. అసలు ఆయనే ఏయే పార్టీ నేతలను సంతృప్తి పరచాలన్నదీ సూచించారని బాధితులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఎమ్మార్‌ అక్రమాలు, భూ కేటాయింపుల వ్యవహారం కేవీపీ మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలు సైతం.. ఆయన అందులో కీలకపాత్ర పోషించారన్న కసితోనే కేవీపీని దృష్టిలో ఉంచుకుని ఆరోపణల వర్షం కురిపిస్తున్నారు.

ఇక ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు కూడా తక్కువ తినలేదని బాధితులు చెబుతున్నారు. మాజీ మంత్రులు దేవేందర్‌గౌడ్‌, నాగం జనార్దన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావుకు సైతం ఎమ్మార్‌లో ఫ్లాట్లు, విల్లాలు కొన్ని బినామీలు, మరికొన్ని కుటుంబసభ్యుల పేరుతో ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సోదరుడయిన యువరాజ్యం అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు సైతం ఎమ్మార్‌లో విల్లా ఉందని బాధితులు వివరించారు. వీరుకాకుండా.. అసలు ఈ వ్యవహారంలో ఐఏఎస్‌ అధికారులే కీలకపాత్ర పోషించారని బాధితులు మండిపడ్డారు. వారి అత్యుత్సాహం వల్లే తమ భూములు పోయాయని, అప్పట్లో పిజెఆర్‌ తమ పక్షాన పోరాడితే ఒక్కరూ అండగా నిలవలేదని దుయ్యబడుతు న్నారు. భూ సేకరణలో అధికారులతో పాటు స్థానిక రౌడీలు కూడా తమను అప్పట్లో భయపెట్టారని ఆరోపిస్తున్నారు.

No comments:

Post a Comment